
విశాఖపట్నం , 13 నవంబర్ (హి.స.)విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. లా కాలేజీ కూడలి సమీపంలో స్కూటీ అదుపుతప్పి రోడ్డు డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో 21 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో మరో యువతి గాయపడింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు సోదరీమణులు స్కూటీపై తమ స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో విశాఖ లా కాలేజీ జంక్షన్ వద్దకు చేరుకోగానే వారి వాహనం అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు స్కూటీపై ఉన్న ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో చిన్న సోదరి అమృతవర్షిని (21) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. పెద్ద సోదరి ఆదిత్య హర్షినికి గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పీఎం పాలెం పోలీసులు వివరాలు సేకరించి గాయపడిన యువతికి అవసరమైన వైద్య సహాయం అందించేలా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్