
న్యూఢిల్లీ, 13 నవంబర్ (హి.స.)
దేశంలోని గిరిజన మాండలికాలు, భాషలు మరియు వారి మౌఖిక సాహిత్య సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం స్పష్టం చేశారు. అంతరించిపోతున్న గిరిజన భాషలకు లిపి, సాహిత్య రూపం ఇచ్చి డాక్యుమెంటేషన్ చేయడం ద్వారానే రాబోయే తరాలకు ఆ ఘన వారసత్వాన్ని అందించగలమని ఆయన పేర్కొన్నారు.
'జనజాతీయ గౌరవ్ దివస్-2026' వేడుకల్లో భాగంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న 'జాతీయ గిరిజన సాహిత్య ఉత్సవం' (National Tribal Literary Festival)లో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గిరిజన సమాజాల చరిత్ర, ప్రకృతితో వారికున్న అవినాభావ సంబంధం, సాంప్రదాయ జ్ఞానం వారి భాషలు మరియు జానపద కథలలో నిక్షిప్తమై ఉన్నాయి.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత 'వికసిత్ భారత్ @2047' లక్ష్య సాధనలో గిరిజనుల భాషా, సాంస్కృతిక వారసత్వానికి సముచిత స్థానం కల్పించడమే ఈ ఉత్సవ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన రచయితలు, కవులు, పరిశోధకులు, భాషావేత్తలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా గిరిజన సాహిత్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ జోరామ్ అనియా, భారతీయ భాషా సమితి చైర్మన్ చమూ కృష్ణ శాస్త్రి, గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి రంజనా చోప్రాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi