
అమరావతి , 17 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 26న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అన్ని ప్రభుత్వ శాఖలు ముందుగానే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఆయా శాఖలకు సంబంధించిన కీలక నిర్ణయాలు, కొత్త ప్రతిపాదనలు, పెండింగ్ అంశాలను సంబంధిత అధికారులు సమగ్రంగా రూపొందించాలని ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను ఈనెల 25వ తేదీ ఉదయం 10.30 గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి అందజేయాలని స్పష్టం చేశారు.
శాఖల నుంచి అందే ప్రతిపాదనలను పరిశీలించి కేబినెట్ సమావేశం అజెండాలో చేర్చనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్