గోపాష్టమి సందర్భంగా కాశీ విశ్వనాథ ఆలయంలో గోపూజ
గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని నాంపల్లిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో గోపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు
gopashtami


హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)

గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని నాంపల్లిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో గోపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోమాత విశిష్టతను చాటారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ ప్రాంత గోరక్ష ప్రముఖ్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ, హిందూ సంప్రదాయం ప్రకారం గోమాత శరీరంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని విశ్వసిస్తారని తెలిపారు. గోపాష్టమి రోజున గోవులను పూజించడం ద్వారా సకల దేవతల ఆశీస్సులు లభించి, ఇళ్లలో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని పేర్కొన్నారు. హిందువులందరూ గోమాత విశిష్టతను అర్థం చేసుకొని గోసేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గోవుల సంతతి అంతరించిపోకుండా వాటిని సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రభుత్వం గోపాష్టమి వారోత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

గోరక్షణ కోసం అనేక మంది స్వచ్ఛందంగా పనిచేస్తున్నప్పటికీ, వారిపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అక్రమంగా గోవులను తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాలపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగకు ముందు లేగదూడలు, యువ పశువులను అక్రమంగా తరలిస్తున్నారని, గోస్మగ్లింగ్ మాఫియాతో సంబంధాలున్న కొందరు పశువైద్యులు వధకు అనుకూలమైనవిగా అక్రమంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ప్రభుత్వం గుర్తించి, అందులో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు యమన్ సింగ్, శ్యామ్, ధీరజ్, రాకేష్, అక్షయ్, అభిషేక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande