
భద్రాద్రి కొత్తగూడెం, 17 నవంబర్ (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మావోయిస్టు డంప్ వివరాలను వెల్లడించారు. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో భూమిలో పాతిపెట్టిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, స్పెషల్ పార్టీ, బీడీ టీం కలిసి సరిహద్దు అడవుల్లో గాలింపు చేపట్టగా ఈ డంప్ బయటపడింది. అందులో 280 బీజీఎల్ లాంచర్లు లభ్యమైనట్లు ఎస్పీ తెలిపారు.
2025 ప్రారంభంలో పీఎల్జీఏ బెటాలియన్ వికేంద్రీకరణ సమయంలో భవిష్యత్ అవసరాల కోసం మావోయిస్టులు ఈ బీజీఎల్ షెల్స్‌ను అటవీ ప్రాంతంలో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ రోహిత్ రాజ్ పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..