
హైదరాబాద్ , 18 నవంబర్ (హి.స.)
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ (Akvan) తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారి తీరం వైపు దూసుకొస్తోంది. దక్షిణ, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాన్ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పున 570 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 580 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నాటికి మచిలీపట్నం, పూరి మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుఫానుగా దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ఏపీ తీర ప్రాంతాలకు తీవ్ర ముప్పు పొంచి ఉంది.
అక్వాన్ తీవ్ర తుఫాన్ ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా తెలంగాణపైనా గట్టిగానే ఉండనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బుధవారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ, గురువారం, శుక్రవారం (నవంబర్ 19, 20 తేదీల్లో) రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా శుక్రవారం నాడు తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఈ రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్