విద్యార్థులకు ‘తెలంగాణ దర్శిని’ కానుక.. చరిత్ర, సంస్కృతిని కళ్లకు కట్టేలా విద్యా పర్యటనలకు రూ. 26.30 కోట్లు మంజూరు
తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులకు సమాజం, చరిత్ర, సంస్కృతిపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ దర్శిని’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Telangana govt


హైదరాబాద్ , 18 నవంబర్ (హి.స.)

తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులకు సమాజం, చరిత్ర, సంస్కృతిపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ దర్శిని’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పుస్తకాల్లో చదివిన చారిత్రక విశేషాలను విద్యార్థులు స్వయంగా చూసి తెలుసుకునేలా ఈ విద్యా పర్యటనలను రూపొందించారు. సమగ్ర శిక్షా పథకంలో భాగంగా పీఎంశ్రీ (PM SHRI) పాఠశాలల విద్యార్థులకు ఈ అద్భుత అవకాశం కల్పించనుండగా, ఇందుకోసం ప్రభుత్వం రూ. 26.30 కోట్ల నిధులను మంజూరు చేసింది.

2.92 లక్షల మంది విద్యార్థులకు అవకాశం:

విద్య, పర్యాటక, సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ సంక్షేమ మరియు అటవీ శాఖల సంయుక్త సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,92,286 మంది విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లనున్నారు. రెండో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు చదువుతున్న విద్యార్థులకు వారి తరగతుల స్థాయికి అనుగుణంగా పర్యటనలు ఉంటాయి. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 900 చొప్పున ఖర్చు చేయనుండగా, ఇందులో రూ. 500 విద్యాశాఖ (సర్వశిక్షా అభియాన్), మిగిలిన రూ. 400 పర్యాటక శాఖ భరించనుంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) పర్యవేక్షణలో ఈ పర్యటనల షెడ్యూల్, నిర్వహణ ప్రణాళిక సాగనుంది.

సందర్శించే ప్రధాన ప్రాంతాలు:

చారిత్రక కట్టడాలు & ఆలయాలు: గోల్కొండ కోట, చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, వరంగల్ కోట, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, వేయి స్తంభాల గుడి, భువనగిరి కోట.

వారసత్వ & ఆధ్యాత్మిక కేంద్రాలు: నాగార్జునసాగర్లోని బుద్ధవనం, కొలనుపాక జైన మందిరం, మేడారం.

కళలు & హస్తకళా కేంద్రాలు: శిల్పారామం, పోచంపల్లి, చేర్యాల, నిర్మల్.

ప్రకృతి & వన్యప్రాణి ప్రాంతాలు: అనంతగిరి కొండలు, లక్నవరం సరస్సు, పాకాల సరస్సు, కవ్వాల్ మరియు అమ్రాబాద్ టైగర్ రిజర్వాయర్

తెలంగాణ వైభవం, వారసత్వ సంపదను భావితరాలకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘తెలంగాణ దర్శిని’ విద్యార్థులకు విజ్ఞానంతో పాటు ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశాభావం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande