విధుల్లో ఉండగానే హెడ్ కానిస్టేబుల్ మృతి
అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు.
Unidentified dead body


అన్నమయ్య జిల్లా, 17 నవంబర్ (హి.స.)

అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు. పెద్దమందం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాజేశ్ (50) గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో ఉండగానే ఆయనకు తీవ్ర అస్వస్థత ఏర్పడటంతో స్టేషన్లోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో రాజేశ్కు అకస్మాత్తుగా స్ట్రోక్ రావడంతో అక్కడే కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన తోటి పోలీసు సిబ్బంది ఆయనకు సాయం చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన మదనపల్లికి తరలించాలని నిర్ణయించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.

విధుల్లో ఉండగానే సహచర పోలీసు అధికారి మృతి చెందడంతో స్టేషన్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజేశ్ మరణవార్తతో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. విధి నిర్వహణలో చురుగ్గా పనిచేస్తున్న సహచరుడిని కోల్పోవడంపై తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande