
అమరావతి , 17 నవంబర్ (హి.స.)
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు ప్రాంతంలో సంభవించిన గ్యాస్ బ్లోఅవుట్ ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. దీంతో గత కొంతకాలంగా ఆందోళనకు గురైన స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బ్లోఅవుట్ను నియంత్రించేందుకు ఓఎన్జీసీ అధికారులు చేపట్టిన చర్యలు ఫలించాయి. బావి నుంచి గ్యాస్ భారీగా వెలువడుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
సంఘటన జరిగిన వెంటనే ఓఎన్జీసీ సాంకేతిక బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించాయి. ఇందులో భాగంగా బావిలోకి మడ్‌ను పంపింగ్ చేశారు. అనంతరం షియర్ రామ్‌ను అమర్చడంతో గ్యాస్ ఉద్ధృతి క్రమంగా తగ్గింది. అన్ని చర్యలు పూర్తయిన తర్వాత బావి పూర్తిగా తమ నియంత్రణలోకి వచ్చిందని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు.
బ్లోఅవుట్ అదుపులోకి రావడంతో స్థానిక ప్రజలు కొంతమేర ఊరట చెందారు. ప్రమాదం మరింత విస్తరించకుండా అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది. అయితే బావి వద్ద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన సాంకేతిక భద్రతా చర్యలు కొనసాగిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పరిణామంతో మామిడికుదురు పరిసర గ్రామాల ప్రజల్లో నెలకొన్న ఆందోళన తగ్గింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్