
అమరావతి , 17 నవంబర్ (హి.స.)
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా ప్రసవ సమయం దగ్గరపడిన గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రసవ గడువు సమీపించిన 3,478 మంది గర్భిణులను అధికారులు గుర్తించారు. వీరిలో అత్యవసరంగా వైద్య సేవలు అవసరమయ్యే 377 మందిని ఇప్పటికే వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఇప్పటివరకు 171 మందికి సురక్షితంగా ప్రసవాలు జరిగినట్లు సమాచారం.
తుఫాన్ ప్రభావం ఉండే 15 జిల్లాల్లో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా 699 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ వైద్యం అందించేందుకు 108, 102, 104 వాహనాలను సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని 88 ఆరోగ్య కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేశారు. తుఫాన్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినా వైద్య సేవలు కొనసాగించేందుకు 955 వైద్య కేంద్రాల్లో ప్రత్యామ్నాయ విద్యుత్ సదుపాయాలు కల్పించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని శాఖ సూచించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్