
స్టేషన్ ఘన్పూర్ 17 నవంబర్ (హి.స.)
స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో మంగళవారం కొత్తగా మంజూరైన చేయూత పెన్షన్ ఉత్తర్వులతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. పేదలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు.
ఏళ్ల తరబడి పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు తీపికబురు చెబుతూ ఒకేసారి 4.63 లక్షల చేయూత పెన్షన్లు మంజూరు చేశారని తెలిపారు. మొదట విడతల వారీగా రెండు లేదా రెండున్నర లక్షల మందికి మాత్రమే ఇస్తారని అనుకున్నా, అర్హులైన పేదలందరికీ ఒకేసారి ఇవ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు కొత్తగా పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డులు ఉన్న 1.10 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా కల్పించే ఇందిరా కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..