
మహబూబ్‌నగర్, 17 నవంబర్ (హి.స.)
డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు పాలమూరు సిద్ధమవుతోంది. ఈ పోటీల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లో కబడ్డీ పోటీలు జరగనున్నాయి. దీంతో జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం స్వయంగా చూసి పరిశీలించారు.
స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి, ఈ నెల 25లోగా పనులన్నీ పూర్తి కావాలని అధికారులకు స్పష్టం చేశారు. క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందించాలని, నిర్మాణాల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. నిర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు.
ఈ పోటీలకు దేశవ్యాప్తంగా దాదాపు 8 వేల మంది క్రీడాకారులు, 1,500 మంది కోచ్‌లు వస్తారని మంత్రి తెలిపారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.226 కోట్లకు పైగా నిధులు ఇచ్చాయని పేర్కొన్నారు. క్రీడాకారులు, కోచ్‌లకు వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు బాగా కల్పించాలని రాష్ట్ర క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి సూచించారు. నిర్ణీత గడువులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు