మహిళలను ఆర్థికంగా బలంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం.. వరంగల్ ఎంపీ కడియం కావ్య
పేదలకు ఆర్థిక భరోసా ఇవ్వడంతో పాటు మహిళలను ఆర్థికంగా బలంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు.
Mp


భూపాలపల్లి, 17 నవంబర్ (హి.స.)

పేదలకు ఆర్థిక భరోసా ఇవ్వడంతో పాటు మహిళలను ఆర్థికంగా బలంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కొత్త చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ బస్సులు ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలో సుమారు 6,536 మందికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. పింఛన్ల మంజూరులో ఎవరైనా లంచం అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హత ఉండి పింఛన్ రాని వారు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూపాలపల్లి అభివృద్ధికి రూ.73 కోట్ల నిధులు తీసుకొచ్చామని, విద్య, వైద్యం, రహదారులు, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande