నిమ్స్ ఆస్పత్రిపై మరోసారి ఏసీబీ పంజా: టెండర్లు, నియామక దస్త్రాల తనిఖీ
నిమ్స్ ఆస్పత్రిపై మరోసారి ఏసీబీ పంజా: టెండర్లు, నియామక దస్త్రాల తనిఖీ
NIMS


హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)

హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు జరిపారు. పది మంది సభ్యులతో కూడిన ఏసీబీ ప్రత్యేక బృందం ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ విభాగంలోకి వెళ్లి కీలక దస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఈ ఏడాది వ్యవధిలో నిమ్స్‌పై ఏసీబీ దాడులు జరగడం ఇది నాలుగోసారి.

అక్టోబర్ నెలలో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలు సంయుక్తంగా జరిపిన తనిఖీలకు కొనసాగింపుగానే ఈ తాజా సోదాలు చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా ఆస్పత్రిలో సిబ్బంది నియామకాలు (మ్యాన్‌పవర్ రిక్రూట్‌మెంట్), సెక్యూరిటీ ఏజెన్సీలు, క్యాంటీన్ నిర్వహణ, మెడికల్ మరియు సర్జికల్ స్టోర్ల టెండర్లకు సంబంధించిన ఒప్పంద పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. అధికారులు అడిగిన వివరాలకు సంబంధించిన రికార్డులను ఆస్పత్రి వర్గాలు వారికి అందజేశాయి. 2014 నుంచి నిమ్స్‌లో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలు, లంచాల ఆరోపణల గుట్టురట్టు చేసే దిశగా ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

లక్ష్మీ భాస్కర్‌కు షరతులతో కూడిన బెయిల్:

ఇదిలా ఉండగా, నిమ్స్‌లో నిధుల దుర్వినియోగం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్‌కు ఏసీబీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్, ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తు అధికారులకు అందుబాటులో ఉండేందుకు ప్రతి మంగళవారం పోలీసుల ఎదుట హాజరుకావాలని షరతు విధించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande