సచివాలయ కాంట్రాక్టు కో-ఆర్డినేటర్లకు ఏపీ సర్కార్ తీపికబురు: వేతనాల్లో 23 శాతం పెంపు
సచివాలయ కాంట్రాక్టు కో-ఆర్డినేటర్లకు ఏపీ సర్కార్ తీపికబురు: వేతనాల్లో 23 శాతం పెంపు
ap


అమరావతి,, 17 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న కో-ఆర్డినేటర్ల నెలవారీ వేతనాలను 23 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులను కూడా విడుదల చేసింది.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లా కో-ఆర్డినేటర్ల (DC) నెలవారీ వేతనం ప్రస్తుతం ఉన్న రూ.36,000 నుంచి రూ.44,280కి చేరనుంది. అసిస్టెంట్ జిల్లా కో-ఆర్డినేటర్లు (ADC), టౌన్ కో-ఆర్డినేటర్ల (TC) వేతనం రూ.27,000 నుంచి రూ.33,210కి పెరగనుంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించడం, ప్రజా సేవలను ప్రజలకు చేరువ చేయడం, వినతులు, ఫిర్యాదుల పరిష్కారంలో ఈ కో-ఆర్డినేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.

2020వ సంవత్సరంలో కాంట్రాక్టు ప్రాతిపదికన విధుల్లో చేరిన నాటి నుంచి వీరికి ఎలాంటి వేతన సవరణ జరగలేదు. తమ జీతాలను పెంచాలని కో-ఆర్డినేటర్లు దీర్ఘకాలంగా ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ఎట్టకేలకు వీరి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం వేతనం పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంతో సచివాలయ కో-ఆర్డినేటర్లకు ఆర్థికంగా భారీ ఊరట లభించినట్లయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande