అక్వాన్ తుపాను హెచ్చరిక: హైఅలర్ట్ ప్రకటించిన ఏపీ సర్కార్.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం
అక్వాన్ తుపాను హెచ్చరిక: హైఅలర్ట్ ప్రకటించిన ఏపీ సర్కార్.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం
anitha


నెల్లూరు, 17 నవంబర్ (హి.స.)

బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తుపాను క్రమంగా బలపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ (RTGS) అధికారులతో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ తుపాను ఈరోజు సాయంత్రానికి తీవ్ర తుపానుగా, ఎల్లుండి (గురువారం) ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే ప్రమాదం ఉందని అధికారులు మంత్రికి వివరించారు. శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు - తుని మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలను బట్టి స్పష్టం చేశారు.

తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీయడంతో పాటు, పలు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి స్థాయిలో హైఅలర్ట్‌గా ఉంటూ ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని హోంమంత్రి ఆదేశించారు. సమష్టి కృషితో ఇప్పటికే రెండు తుపాన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇప్పుడు కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలకు పూర్తి భరోసా కల్పించాలని సూచించారు.

రానున్న నాలుగు రోజుల పాటు కోస్తా తీరప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. అలాగే, కోతకు వచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు అందించాలని ఆమె ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande