
హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక అవసరాలపై ఆయన కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు ప్రతిపాదనలకు త్వరగా ఆమోదం తెలిపి, ఆ పనులను పట్టాలెక్కించేలా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
ఇటీవల రాష్ట్రాన్ని వణికించిన అర్నబ్, మురసు తుపానులతో పాటు ఎల్‌నినో ప్రతికూల పరిస్థితుల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్ట అంచనాలకు సంబంధించిన సమగ్ర నివేదికలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విపత్తుల నుంచి రాష్ట్రం త్వరగా కోలుకునేందుకు వీలుగా కేంద్రం నుంచి తక్షణ ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇక అధికారిక సమావేశాలు ముగిసిన అనంతరం, సాయంత్రం ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా నివాసంలో జరగనున్న ఓ శుభకార్యానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ వేడుక అనంతరం రాత్రికి ఆయన తిరిగి అమరావతికి బయలుదేరి వెళ్లనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi