
అమరావతి , 18 నవంబర్ (హి.స.)
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను నెమ్మదిగా కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 580 కిలోమీటర్లు, మచిలీపట్నం, విశాఖపట్నం తీరాలకు 610 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
రేపు సాయంత్రానికి అక్వాన్ అతి తీవ్ర తుపానుగా మారే అవకాశముందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం నెల్లూరు నుంచి విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని హెచ్చరించారు.
దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పరిస్థితిని ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, రైతులు పంటల రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్