పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. కలెక్టర్ హరిత
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులకు సూచించారు
Collector


ఆసిఫాబాద్, 18 నవంబర్ (హి.స.)

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులకు సూచించారు. కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అర్హులు ఈ పథకానికి వర్తిస్తారని, లబ్ధిదారులను గుర్తించడానికి రేషన్ కార్డులను ఆధారంగా తీసుకుంటామని తెలిపారు. రేషన్ కార్డు లేని వారి వివరాలను ఆధార్ ద్వారా సేకరిస్తామని చెప్పారు. జిల్లాలోని 335 గ్రామపంచాయతీలు, 2 మున్సిపాలిటీల్లో గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు పెట్టి అర్హుల వివరాలు తీసుకుంటామని వెల్లడించారు. దరఖాస్తు పత్రాలను లబ్ధిదారుల సంతకాలతో సహా స్కాన్ చేసి సంబంధిత బీమా సంస్థకు పంపుతామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. మారుమూల, గిరిజన గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం లాభం అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి పారదర్శకంగా వివరాల సేకరణ, పరిశీలన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande