
హైదరాబాద్ , 18 నవంబర్ (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహారాన్ని మెరుగుపరిచే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మరో ఏడు జిల్లాలకు విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ జయంతిని పురస్కరించుకుని రేపటి నుంచి ఈ పథకాన్ని కొత్త జిల్లాల్లో ప్రారంభించనున్నారు.
భూపాలపల్లి, జనగామ, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమల్లోకి రానుంది. దీంతో ఆయా జిల్లాల్లోని అంగన్వాడీలకు వచ్చే చిన్నారులకు ఉదయం అల్పాహారం అందుబాటులోకి రానుంది. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన ఆహారాన్ని అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
చిన్న వయసులోనే సరైన పోషకాహారం అందించడం ద్వారా పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని మరింత సమర్థంగా అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో ఏడు జిల్లాలకు పథకం విస్తరించడంతో అక్కడి చిన్నారులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్