
హైదరాబాద్ , 18 నవంబర్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రేపు సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సీఎం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు జీవిత బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తున్నారు.
అలాగే విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ దుబ్బాక, సిద్ధిపేట ప్రాంతాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆధునిక వసతులతో కూడిన ఈ పాఠశాలల ఏర్పాటుతో విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు. సీఎం పర్యటనలో పాల్గొనే ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. ఈ పర్యటనలో సంక్షేమం, విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్