
అమరావతి , 18 నవంబర్ (హి.స.)
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక అడుగు వేసింది. దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించిన కేసులో జగన్‌తో పాటు దాల్మియా, మరికొందరిపై అభియోగాలు నమోదు చేస్తూ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ తన ఛార్జిషీట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో నిధుల లావాదేవీలు, ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించి దర్యాప్తు సంస్థ సేకరించిన వివరాలను కోర్టుకు సమర్పించింది. తాజాగా దాఖలైన ఛార్జిషీట్‌ను న్యాయస్థానం పరిశీలించనుంది. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో గతంలోనే ఈడీ కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి జగన్‌తో పాటు దాల్మియా కంపెనీలకు చెందిన కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసులపై గత పదిహేనేళ్లుగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలు కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ తాజాగా మరో ఛార్జిషీట్ సమర్పించడం రాజకీయ, న్యాయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు పరిశీలన అనంతరం ఈ కేసు విచారణలో తదుపరి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్