
పెద్దపల్లి, 18 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సాగించిన ఉద్యమం ఎప్పటికీ గుర్తుండిపోతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు.
పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం జరిగిన పెద్దపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఉద్యమ సమయంలో అరెస్టయినప్పటికీ కేసీఆర్ దీక్షను ఆపలేదని, రాష్ట్ర సాధననే లక్ష్యంగా ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. ఈ నెల 29న కరీంనగర్లో జరగనున్న దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో మరిచిపోలేని రోజుగా నిలుస్తుందని చెప్పారు.
తెలంగాణ ఉద్యమం గురించి కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసలు అవగాహన లేదని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు వెళ్లిందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. సాగునీరు, తాగునీరు, కరెంటు, గురుకులాలు, రైతుబంధు వంటి పథకాల వల్ల ప్రజలకు ఎంతో లాభం చేకూరిందని తెలిపారు. దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు రావడానికి కేసీఆర్ కృషే కారణమని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం సాగునీటి కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని, కన్నెపల్లి వద్ద మోటార్లు వెంటనే నడిపి రైతులకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో చెప్పినట్లుగా పెన్షన్లు పెంచి వెంటనే అమలు చేయాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెన్షన్ల విషయంలో లబ్ధిదారులకు సరైన భరోసా లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి పోలీసులకు గానీ, ఇతర ఒత్తిళ్లకు గానీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజలు ఇప్పటికే ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారని, బీఆర్ఎస్ సమావేశాలకు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా సొంతంగా వస్తున్నారని తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రజలను చైతన్యం చేసే బాధ్యత తీసుకోవాలని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు