
హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.)
కాంగ్రెస్ సర్కార్ క్రీడల గురించి చెబుతున్న గొప్ప మాటలకు, నేల మీద కనిపిస్తున్న వాస్తవానికి ఎక్కడా సంబంధం లేకుండా పోయిందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు.
ఒలింపిక్స్ ను హైదరాబాద్ కు తెస్తామని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి, కనీసం ఆటగాళ్ల కష్టాలు తీర్చలేకపోతున్నారని విమర్శించారు. పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూనే, చిన్న చిన్న అవసరాలను కూడా పట్టించుకోని తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆటగాళ్ల జీవితాలను గాలికి వదిలేయకుండా, వెంటనే వారి ఇబ్బందులకు పరిష్కారం చూపాలని కోరారు.
ఫుట్‌బాల్ ఈవెంట్ల పేరుతో వంద కోట్ల రూపాయల ప్రజా సొమ్మును ఖర్చు పెడుతున్న ప్రభుత్వం, నిజమైన ఆటగాళ్లకు సాయం చేయడంలో మాత్రం వెనకడుగు వేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. మంచి ప్రతిభ ఉన్నా, చేయూత లేక ఎంతో మంది యువ క్రీడాకారులు దారి తెలియక నిలబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి గోడు వింటుంటే బాధేస్తోందని అన్నారు.
ఖేలో ఇండియా పోటీల కోసం ప్రధానిని ఆహ్వానించే హడావుడిలో ఉన్న సీఎం, రాష్ట్రంలో శిక్షణ ఇచ్చేవారే లేరన్న విషయాన్ని పట్టించుకోవడం లేదని ఎత్తిచూపారు. ముందు కోచ్‌లను నియమించి, గ్రామాల్లో దాగి ఉన్న ప్రతిభావంతులను వెతికి పట్టుకుని ప్రోత్సహిస్తేనే ఖేలో ఇండియాలో తెలంగాణ ఆటగాళ్లు మెరవగలరని సూచించారు. అందుకోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు