పుష్కర ఘాట్ల పనులను పరిశీలించిన కలెక్టర్ బి. సత్యప్రసాద్
ధర్మపురిలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం స్వయంగా వెళ్లి చూశారు. ముందుగా ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులను పరిశీలించారు.
Collector


జగిత్యాల, 18 నవంబర్ (హి.స.)

ధర్మపురిలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం స్వయంగా వెళ్లి చూశారు. ముందుగా ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులను పరిశీలించారు.

రాబోయే గోదావరి పుష్కరాల కోసం కడుతున్న ఘాట్ల పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, చెప్పిన సమయానికే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడా ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని స్పష్టం చేశారు.

ఆ తర్వాత గోదావరి ఒడ్డున కడుతున్న పుష్కర ఘాట్ల దగ్గరకు వెళ్లారు. కొత్త ఘాట్లు, రోడ్లు, హెలిప్యాడ్ ల పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మహాలక్ష్మి ఘాట్ నుంచి వీఐపీ ఘాట్ వరకు వేస్తున్న రోడ్లు, ఇతర వసతుల పనులను కూడా నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు చెప్పారు. 2027 గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు ముందే పూర్తి చేయాలని అన్నారు. భక్తుల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, కరెంటు, రోడ్లు, రాకపోకలతో పాటు అన్ని మౌలిక వసతులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. పుష్కరాల సమయంలో ఉండే రద్దీకి తగ్గట్టుగా ఘాట్ల దగ్గర కావాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలపై ముందే ప్రణాళిక వేసి అమలు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు చూసుకోవాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande