ఇది ఎల్నినో కాదు.. అనుముల నినో: కేటీఆర్
నాగార్జునసాగర్ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
KTR


హైదరాబాద్ , 18 నవంబర్ (హి.స.)

నాగార్జునసాగర్ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు కలిసి నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. సాగర్ జలాలపై తెలంగాణకు రావాల్సిన హక్కులను పూర్తిస్థాయిలో కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్న నీటి తరలింపును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి ప్రభుత్వం ఏవైనా ప్రతిపాదనలు పంపిందా అని నిలదీశారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఏపీ చేపడుతున్న ప్రాజెక్టును నిలిపివేయాలని కోరిందా అని ప్రశ్నించారు. తెలంగాణ తాగునీటి అవసరాల కోసం 40 టీఎంసీల నీటిని కేటాయించాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ నీటి తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న చర్యలేంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వాతావరణ పరిస్థితులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇది ఎల్నినో కాదని, అనుముల నినో అంటూ కేటీఆర్ చమత్కరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande