
ఖమ్మం, 18 నవంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో న్యాయ సేవల గురించి ప్రజలకు తెలియజేసేందుకు బుధవారం అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు.
జాతీయ న్యాయ సేవా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఆదేశాలతో జరిగిన ఈ కార్యక్రమానికి సత్తుపల్లి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, ఆరవ అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీనివాసరావు నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బు లేకనో, సామాజిక పరిస్థితుల వల్లనో ఎవరూ న్యాయ సహాయానికి దూరం కాకూడదని, అర్హులందరికీ ఉచితంగా న్యాయ సహాయం అందించడమే ఈ సంస్థల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలు ఈ సేవలను వాడుకోవాలని సూచించారు.
లోక్ అదాలత్ లు, కోర్టుకు వెళ్లక ముందే కేసులను పరిష్కరించడం, న్యాయ చైతన్య సదస్సులు, జైలు అదాలత్ లు, ఉచిత న్యాయ సహాయం వంటి సత్తుపల్లి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చేసే పనుల గురించి కక్షిదారులకు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..