
శ్రీశైలం , 18 నవంబర్ (హి.స.)
శ్రీశైలం పరిధిలోని సున్నిపెంట గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. తొలిసారిగా ఈ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో స్థానికంగా రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను నంద్యాల జిల్లా కలెక్టర్ పూర్తి చేసి వివరాలను ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు.
అయితే మరోవైపు సున్నిపెంటలో ఎన్నికల నిర్వహణపై న్యాయపరమైన వివాదం తెరపైకి వచ్చింది. గ్రామానికి చెందిన నాగరాజు ఎన్నికల ప్రక్రియను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు హైకోర్టులో కేసు దాఖలు కావడంతో స్థానికంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. న్యాయస్థానం తీసుకునే నిర్ణయంపై సున్నిపెంట పంచాయతీ ఎన్నికల భవిష్యత్తు ఆధారపడి ఉండనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్