ఏపీని సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయి సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
Lokesh


అమరావతి , 18 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయి సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. చిప్ల తయారీ నుంచి ప్యాకేజింగ్ వరకు అన్ని విభాగాల్లో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా నిలబెట్టడమే లక్ష్యమని తెలిపారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు.

సిలికాన్ ఫ్యాబ్ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 80 శాతం వరకు పెట్టుబడి సబ్సిడీ కల్పించనున్నట్లు వివరించారు. కేంద్రం ఇచ్చే పెట్టుబడి రాయితీకి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను అందిస్తుందని చెప్పారు. రెండో దశ ఇండియా సెమీకండక్టర్ మిషన్కు అనుగుణంగా రాష్ట్ర విధానంలో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. డిస్ప్లే, కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్లకు 70 శాతం వరకు రాయితీలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

తిరుపతిలో సుమారు 5 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక సెమీకండక్టర్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఒకేచోట కల్పించడంతో పాటు సింగిల్ విండో విధానంలో అనుమతులు వేగంగా మంజూరు చేస్తామని లోకేశ్ తెలిపారు.

అలాగే ఐఐటీ తిరుపతిలో ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణ పొందే అభ్యర్థులకు నెలకు రూ.10 వేల ప్రోత్సాహకం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande