తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దుర్గేశ్
తుపాను ప్రభావం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు.
Rain


అమరావతి , 18 నవంబర్ (హి.స.)

తుపాను ప్రభావం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నెల 22వ తేదీ వరకు భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బాధితుల కోసం ఏర్పాటు చేసే శిబిరాల్లో ఆహారం, తాగునీరు, ఇతర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను సిద్ధం చేయాలన్నారు. తుపాను ప్రభావం ఉన్న పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కంట్రోల్ రూమ్ల ద్వారా నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని చేరవేయాలని మంత్రి దుర్గేశ్ అధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande