
హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.)
హనుమకొండ జిల్లాలోని ముల్కనూరులో అర్హులకు కొత్త పింఛన్ల పత్రాలను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.
అర్హత ఉన్నా ఏదో కారణంతో ఇంతకాలం పింఛన్ అందని వారికి రాజకీయాలతో సంబంధం లేకుండా పింఛన్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. వృద్ధులకు కూడా త్వరలోనే పింఛన్లు ఇచ్చే పని మొదలుపెడతామని చెప్పారు.
తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాత సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా కొనసాగిస్తూనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టామని గుర్తుచేశారు.
ములుకనూరు బస్టాండ్ బాగు చేయడానికి కోటి రూపాయికి పైగా, ఎల్కతుర్తిలో కొత్త బస్టాండ్ కట్టడానికి నాలుగు కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామని పేర్కొన్నారు.
మహిళా సంఘాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి రుణ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామని, వడ్డీ లేని రుణాల వల్ల ఈ ఒక్క మండలంలోనే నాలుగు కోట్ల రూపాయల వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించిందని తెలిపారు.
రాష్ట్రం మొత్తంలో మహిళా సంఘాలకు 79 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామని, భీమదేవరపల్లి మండలాన్ని జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగించి వైద్య శిబిరాలు పెడుతున్నామని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు