
ఆదిలాబాద్, 18 నవంబర్ (హి.స.)
ఉట్నూర్ లో పేదలకు కొత్త పింఛన్లు అందజేసిన సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, తన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడమే తనకు ప్రధానమైన పని అని చెప్పారు. గ్రామాల బాగు కోసం ప్రజలందరి అండదండలతో పనిచేస్తానని అన్నారు. పేదవారిని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం వరుసగా పథకాలు తీసుకొస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం ఇప్పటికే ప్రజలకు అందుతున్నాయని గుర్తుచేశారు.
బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని స్టార్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏళ్ల తరబడి పింఛన్ రాక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలబడ్డారని చెప్పారు. లబ్ధిదారుల చేతికి స్వయంగా పింఛన్ మంజూరు పత్రాలను అందించారు. పేదల సంక్షేమం కోసం సీఎం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ మండలం నుంచి మొత్తం 1,300 మంది పింఛన్ కోసం పేర్లు నమోదు చేసుకుంటే, అందులో 1,087 మందికి ఇప్పుడు ఆమోదం లభించిందని వెల్లడించారు. టెక్నికల్ కారణాలతో పెండింగ్ లో పడిన మరో 300 మంది సమస్యను కూడా త్వరలోనే పరిష్కరించి వారికి కూడా పింఛన్ వచ్చేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి నాడు ప్రతి ఇంటి పెద్దకు ఉపయోగపడేలా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సీఎం ప్రారంభించబోతున్నారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు