
హైదరాబాద్ , 18 నవంబర్ (హి.స.)
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అక్రమాల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు కీలక మలుపు తిరుగుతోంది. ఆసుపత్రిలో జరిగిన టెండర్ల ప్రక్రియలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా కోవిడ్ సమయంలో బెడ్ల కేటాయింపుల పేరుతో రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో బెడ్ కేటాయించేందుకు రూ.లక్ష వరకు లంచం తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో బెడ్ల కేటాయింపులకు సంబంధించిన అక్రమాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే అరెస్టయిన అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్‌తో పాటు ప్రశాంత్ పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ఆసుపత్రిలోని క్యాంటీన్, మెడికల్ షాపుల నిర్వహణకు సంబంధించిన టెండర్లలోనూ అక్రమాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బంది నియామకాలు, వాటి టెండర్లలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం.
మరోవైపు లక్ష్మీ భాస్కర్ ఆస్తుల వివరాలపైనా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంపాదన, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్