
కడప, 18 నవంబర్ (హి.స.)కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు నోటీసులను అందజేశారు. అదే సమయంలో వాట్సాప్ ద్వారా కూడా నోటీసుల ప్రతులను పంపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా ఘర్షణలు, అల్లర్లు జరిగే అవకాశాలున్నాయని సమాచారం అందడంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఎంపీ అవినాష్రెడ్డి బయటకు రావద్దని సూచిస్తూ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో పోలీసుల నోటీసులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్