
కడప జిల్లా , 18 నవంబర్ (హి.స.)
కడప జిల్లా పులివెందులలో పోలీసుల మోహరింపు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఎంపీ అవినాష్రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఆయన ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, అవినాష్రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నట్లు సమాచారం. దీంతో పులివెందులలో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో రాజకీయ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో పులివెందులలో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్