
హైదరాబాద్ , 18 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డిలో 11.3 డిగ్రీలు, కామారెడ్డిలో 11.7 డిగ్రీలు, వికారాబాద్‌లో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మహబూబ్‌నగర్‌లోనూ ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు పడిపోయింది.
ఇదే సమయంలో రాష్ట్రంలోని మరో 25 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. దీంతో ఉదయం వేళల్లో బయటకు వెళ్లేవారు వెచ్చని దుస్తులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు చలి ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు చలి కష్టాలు మరింత పెరిగే సూచనలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్