వేంపల్లిలో సర్పంచ్ నామినేషన్ వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ శ్రేణుల ధర్నా
వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
YSRCP


వైఎస్సార్ జిల్లా , 18 నవంబర్ (హి.స.)వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నివాసం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బయటకు వచ్చారు. వేంపల్లి సర్పంచ్ అభ్యర్థి తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు వారంతా కలిసి బయలుదేరారు.

అయితే బిడాల మిట్ట రోడ్డు వద్ద పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల చర్యలపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.

అనంతరం పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నామినేషన్ దాఖలు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగాల్సిన సమయంలో పోలీసుల అడ్డంకుల కారణంగా వేంపల్లిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande