లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ ఇన్స్పెక్టర్
నగరంలో మరో అవినీతి ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గోల్కొండ జోన్ పరిధిలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ రూ. 20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు.
Acb


హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)

నగరంలో మరో అవినీతి ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

గోల్కొండ జోన్ పరిధిలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ రూ. 20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు.

టోలిచౌకి పరిధిలోని ఓ హోటల్, కేఫ్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల కోసం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత కూడా మరో గంటపాటు కేఫ్ నడిపించుకునేందుకు అనుమతించడంతో పాటు ఇతర వెసులుబాట్లు కల్పించేందుకు ఇన్స్పెక్టర్ నెలవారీ మామూళ్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

మొదట నెలకు రూ. 50 వేలు అడిగిన సీఐ ఆ తర్వాత మొదటి నెలకు రూ. 10 వేలు తగ్గించి రూ. 40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత నెల 31న మొదటి విడతగా రూ. 20 వేలు తీసుకుని మిగిలిన రూ. 20 వేలు తీసుకుంటుండగా బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి సీఐని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు, ఇన్స్పెక్టర్ను అదుపులోకి తీసుకున్న తర్వాత తనిఖీలు చేయగా నాలుగు వేర్వేరు కవర్లలో పెట్టిన రూ. 1.80 లక్షల లెక్కల్లో లేని నగదును గుర్తించి స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

అనంతరం నిందితుడు రమేష్ నాయక్ను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande