
ఢిల్లీ, 19 నవంబర్ (హి.స.)
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అఖిల భారత కులగణన సమన్వయ కమిటీ ఆహ్వానం అందించింది. ఈ నెల 28న ఢిల్లీలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకావాలని కమిటీ ప్రతినిధులు ఆయనను కోరారు. ఈ మేరకు కమిటీ సభ్యులు పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిసి సభకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశవ్యాప్తంగా కులగణన ప్రక్రియను సమగ్రంగా నిర్వహించాలనే డిమాండ్‌తో ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా బీసీ వర్గాల్లోని అన్ని కులాలను గుర్తించి, వాటి జనాభా వివరాలను కచ్చితంగా సేకరించాలని వారు కోరారు. ఇందుకోసం కులగణనలో డ్రాప్‌డౌన్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తద్వారా ఏ కులానికి చెందిన వారైనా తమ వివరాలను సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కులగణన అనేది కేవలం జనాభా లెక్కల సేకరణకే పరిమితం కాకూడదని కమిటీ నాయకులు పేర్కొన్నారు. ఆయా సామాజిక వర్గాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని వివరాలు సేకరించాలని డిమాండ్ చేశారు. అప్పుడే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఢిల్లీ సభ ద్వారా కులగణన ప్రాధాన్యతను దేశవ్యాప్తంగా చాటిచెప్పాలని కమిటీ భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్