
భద్రాద్రి కొత్తగూడెం, 19 నవంబర్ (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంజనేయ కాలనీలో గురువారం తెల్లవారుజామున కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 100 ఇళ్లను, 54 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 45 వాహనాలపై జరిమానాలు వేయగా, 15 వాహనాల నుంచి జరిమానాలు వసూలు చేశారు. సరైన పత్రాలు లేని 11 వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ మద్యం విక్రయాలకు సంబంధించి నాలుగు కేసులు నమోదు చేశారు.
అనంతరం కాలనీవాసులతో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ సమావేశమై మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి విక్రయాలు, వినియోగంపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..