శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి సొంత పార్టీ నేతల సెగ.. ఇంటి వద్ద అసమ్మతి వర్గం ఆందోళన
అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన ఎదురైంది.
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి సొంత పార్టీ నేతల సెగ.. ఇంటి వద్ద అసమ్మతి వర్గం ఆందోళన


అనంతపురం, 19 నవంబర్ (హి.స.)

అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన ఎదురైంది. ఎంపీపీ పదవి కేటాయింపు విషయంలో అసంతృప్తికి గురైన టీడీపీ నేతలు ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.

ఎంపీటీసీ ఈశ్వర్ రెడ్డికి ఎంపీపీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన వర్గీయులు ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిణామంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించగా, వారితో నేతలు వాగ్వాదానికి దిగారు.

పార్టీలోనే పదవుల కోసం రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, డీసీసీబీ చైర్మన్ కేశవరెడ్డి రంగంలోకి దిగారు. అసమ్మతి నేతలతో మాట్లాడి వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీపీ పదవి వ్యవహారం పార్టీ అధిష్ఠానానికి ఎలాంటి తలనొప్పులు తెచ్చిపెడుతుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande