శింగనమల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. మాజీ మంత్రి శైలజానాథ్ను అడ్డుకున్న పోలీసులు
అనంతపురం జిల్లాలోని శింగనమల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత శైలజానాథ్ను పోలీసులు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది.
శింగనమల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. మాజీ మంత్రి శైలజానాథ్ను అడ్డుకున్న పోలీసులు


అనంతపురం జిల్లా, 19 నవంబర్ (హి.స.)అనంతపురం జిల్లాలోని శింగనమల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత శైలజానాథ్ను పోలీసులు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజులకు పోలీసులు అనుమతి ఇవ్వడం రాజకీయ వివాదానికి దారితీసింది.

శింగనమల మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్సీపీ ఆరు, టీడీపీ ఆరు స్థానాలను గెలుచుకున్నాయి. దీంతో ఎంపీపీ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు.

తమ పార్టీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపించారు. పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడ్డుకుని, టీడీపీ ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించడంపై అభ్యంతరం తెలిపారు.

ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరసనకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అక్కడ గందరగోళం నెలకొంది. భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande