
హైదరాబాద్ , 19 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో సీఎం పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్ర అభివృద్ధిని వికేంద్రీకరించడంలో భాగంగా తెలంగాణను మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలు, వనరులు, అవకాశాలను ఉపయోగించుకుని సమగ్ర ప్రగతికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కీలక పాత్ర పోషించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఓఆర్ఆర్ నిర్మాణం వల్ల నగర విస్తరణకు, పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడుల ఆకర్షణకు మార్గం సుగమమైందన్నారు. భవిష్యత్తులోనూ మెరుగైన రవాణా వ్యవస్థ, ఆధునిక రహదారుల ద్వారా తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్