
హనుమకొండ, 19 నవంబర్ (హి.స.)
జాతీయస్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 అథ్లెటిక్స్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది.
స్టేడియం గ్యాలరీలకు ఆకర్షణీయమైన రంగులు వేయడంతో పాటు ఖేలో ఇండియా లోగోను ఏర్పాటు చేసి క్రీడా శోభ తీసుకురావాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు.
ఈ నేపథ్యంలో గురువారం ఆమె జేఎన్ఎస్ స్టేడియాన్ని సందర్శించి జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గ్యాలరీలకు రంగులు వేయడం, స్టేడియం సుందరీకరణ, ఖేలో ఇండియా లోగో ఏర్పాటు వంటి అంశాలపై జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కొత్త ప్రశాంత్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. జాతీయస్థాయి పోటీలకు తగ్గట్టుగా స్టేడియాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ వెంకన్న నుంచి పారిశుద్ధ్యం, పరిసరాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకుని, పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
డిసెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జేఎన్ఎస్ స్టేడియంలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, సాంకేతిక బృందాలు హాజరుకానున్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, భద్రత, వసతి, భోజనం, రవాణా వంటి అన్ని సదుపాయాలు పకడ్బందీగా కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..