
ఏలూరు, 19 నవంబర్ (హి.స.)
ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం మండలంలో వైస్ ఎంపీపీ పదవి కూటమి పార్టీల మధ్య వివాదానికి దారితీసింది. ఈ పదవిని జనసేనకు కేటాయిస్తామని తొలుత హామీ ఇచ్చినప్పటికీ, చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిని తెరపైకి తీసుకురావడంతో జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా నిర్ణయం మార్చుకున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య పదవుల పంపకాలపై ముందుగానే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొయ్యలగూడెం వైస్ ఎంపీపీ పదవిని జనసేనకు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఎన్నికల సమయానికి బీజేపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థిని వైస్ ఎంపీపీగా ప్రతిపాదించడంతో వివాదం మొదలైంది.
తమ పార్టీకి దక్కాల్సిన పదవిని మరో పార్టీకి కేటాయించడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాట ఇచ్చి తప్పడం సరికాదంటూ నిరసన తెలిపాయి. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న జనసేన నాయకులను అక్కడి నుంచి పంపించివేశారు. ఈ పరిణామం ఏలూరు జిల్లా కూటమి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్