
కడప జిల్లా, 19 నవంబర్ (హి.స.)
కడప జిల్లాలోని వేంపల్లిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ వ్యవహారం పోలీసు అధికారుల మధ్య వివాదానికి దారితీసింది. వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ వేయించేందుకు ప్రయత్నించిన క్రమంలో ఇద్దరు డీఎస్పీల మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. వేంపల్లి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న వైఎస్సార్సీపీ మద్దతుదారుడిని నామినేషన్ దాఖలు చేయించేందుకు ప్రొద్దుటూరు డీఎస్పీ బాలస్వామి రెడ్డి వేంపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్.. బాలస్వామి రెడ్డికి ఫోన్ చేసి అభ్యర్థిని తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా తీసుకొస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
తాను వచ్చే వరకు అభ్యర్థిని పోలీస్ స్టేషన్లోనే ఉంచాలని సూచించినట్లు సమాచారం. దీనికి స్పందించిన బాలస్వామి రెడ్డి, ఎస్పీ ఆదేశాల మేరకే అభ్యర్థిని స్టేషన్కు తీసుకొచ్చినట్లు చెప్పినట్లు తెలిసింది.
ప్రస్తుతం వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వేంపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. నామినేషన్ దాఖలు వ్యవహారంలో పోలీసు అధికారుల మధ్య చోటుచేసుకున్న ఈ పరిణామాలు స్థానికంగా రాజకీయ చర్చకు దారితీశాయి. అభ్యర్థి నామినేషన్ వేస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్