
ఖమ్మం, 19 నవంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా వైరాలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికలు)ను జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర సందర్శించారు. పాఠశాలలోని సౌకర్యాలు, నిర్వహణ తీరును పరిశీలించారు. పాఠశాల విస్తీర్ణం గురించి అడగగా, 14 ఎకరాల విస్తీర్ణంలో రెండు కుంటలు ఉన్నాయని ప్రిన్సిపాల్ రాధిక వివరించారు.
అనంతరం వంటగది, సరుకుల గది, బియ్యం నిల్వ గదులను కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరిశుభ్రత, సరుకుల నిల్వ, నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో కలియతిరుగుతూ తొమ్మిదో తరగతి విద్యార్థినులతో ముచ్చటించి వారి చదివే సామర్థ్యాన్ని పరీక్షించారు.
మంచి పఠన అలవాట్లు, భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని విద్యార్థినులను ప్రోత్సహించారు. పాఠశాల నిర్వహణ, నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. కలెక్టర్ ప్రశంసలు ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థినుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఆరోగ్యకరమైన అభ్యాస వాతావరణాన్ని కొనసాగిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు