
అనకాపల్లి జిల్లా, 19 నవంబర్ (హి.స.)
అనకాపల్లి జిల్లాలోని మునగపాక మండల పరిషత్ అధ్యక్ష పదవి అనూహ్యంగా వైఎస్సార్సీపీకి దక్కింది. ఎంపీపీ ఎన్నికలో వైఎస్సార్సీపీ, కూటమి అభ్యర్థులు సమాన సంఖ్యలో ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోవడంతో చివరకు డ్రా పద్ధతిలో విజేతను నిర్ణయించారు. ఈ ప్రక్రియలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మొల్లేటి శంకర్‌ను అదృష్టం వరించింది. దీంతో మునగపాక ఎంపీపీ పదవిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.
మండలంలోని ఎంపీటీసీ స్థానాల్లో ఇరు వర్గాలకు చెరో ఎనిమిది స్థానాలు దక్కడంతో ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠగా మారింది. సభ్యుల సంఖ్య సమానంగా ఉండటంతో అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు. డ్రాలో వైఎస్సార్సీపీ అభ్యర్థికి అనుకూలంగా ఫలితం రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది.
అయితే ఈ పరిణామంపై జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. డ్రా ఫలితాన్ని అంగీకరించకుండా మరోసారి డ్రా తీయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులతో పాటు మీడియా ప్రతినిధులపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మళ్లీ డ్రా నిర్వహించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో మునగపాక ఎంపీపీ ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్