
హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై, సొంత ప్రభుత్వంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపడంతో టీపీసీసీ నాయకత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది.
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ రాజగోపాల్రెడ్డి ప్రసంగాల వీడియో క్లిప్పింగ్లతో పాటు వ్యాఖ్యల సారాంశాన్ని నివేదిక రూపంలో ఏఐసీసీ పెద్దలకు పంపి ఫిర్యాదు చేశారు.
పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరినీ వదిలేది లేదని మహేశ్కుమార్ గౌడ్ స్పష్టం చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశమైంది, బుధవారం మునుగోడులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్రెడ్డి నియోజకవర్గాల మధ్య నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ కొడంగల్, మధిర, హుజూర్నగర్ నియోజకవర్గాలకే వేల కోట్ల నిధులు ఇస్తున్నారని, ఫ్లోరైడ్ సమస్యతో దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్న మునుగోడును మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..