
అనకాపల్లి, 19 నవంబర్ (హి.స.)
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. టీడీపీలో చేరిన ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కేవలం 24 గంటల్లోనే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రలోభాలకు గురిచేసి ఇద్దరు ఎంపీటీసీలను టీడీపీలో చేర్చుకున్నారనే ఆరోపణలు ఈ సందర్భంగా తెరపైకి వచ్చాయి.
నక్కపల్లి మండలంలో రాజకీయ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఎంపీటీసీలు మీసం నానాజీ, వీసం దేవిని టీడీపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నానాజీకి వైస్ ఎంపీపీ పదవి ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నట్లు సమాచారం. అయితే ఈ పరిణామం ఎక్కువసేపు కొనసాగలేదు. టీడీపీలో చేరిన మరుసటి రోజే ఇద్దరు ఎంపీటీసీలు మనసు మార్చుకుని తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు.
వైఎస్సార్సీపీ నేత వీసం రామకృష్ణ ఇద్దరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మీసం నానాజీ మాట్లాడుతూ.. జరిగిన పరిణామానికి క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు. టీడీపీలోకి వెళ్లడం దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించారు. ఇకపై పార్టీ కార్యకర్తలకు, కేడర్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ పరిణామం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్